ఈ ‘వారణాసి’ చూసారా? – గుడిపాటి
- Gudipati
- Feb 27, 2024
- 2 min read
Updated: Feb 28, 2024

లోకాన్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాన్ని తమదైన అనుభవకోణంలోంచి చూసే తరం సృజనాత్మక వ్యాసంగంలో ఆర్తి ఉంటుంది. ఆర్ద్రత ఉంటుంది. మనసులోని మాటలను, అనుభవాల పలవరింతను ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా నిసర్గమైన రీతిన అభివ్యక్తం చేయడం ఈ తరపు యువత ప్రత్యేకత. ఇలాంటి తరానికి చెందిన మిత్రుడు #మామిడాల_వినోద్. నిండా మూడు పదులు నిండని వయసు తనది. నిండైన ఉత్సాహంతో చరిస్తుంటాడు. నిత్యనూతనంగా చలిస్తుంటాడు. ఏకకాలంలో నాలుగు పనులను చేపట్టి నిర్వహించే సామర్థ్యం అతని సొంతం. మల్టీ టాస్కింగ్ తన పనిలోనూ, బతుకురీతిలోనూ వ్యక్తమవుతూ ఎప్పటికప్పుడు విస్మయానికి లోను చేస్తుంటుంది. వృత్తిరీత్యా జర్నలిస్టు అయినప్పటికీ తనలో ఒక డిజైనర్, ఫోటోగ్రాఫర్, రచయిత ఉన్నారు. ప్రత్యేకించి కవిత్వం రాయలేదు గానీ కవితా చేలాంచలాల వెంట తిరిగే కవి హృదయం ఉంది. వాక్యాల నడుమ కవితాత్మ కనిపించీ కనిపించనీ రీతిన సూపర్ ఇంపోజ్ అయి దాగుంటుంది. గడిచే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలనే తపన అతను చెప్పకనే వ్యక్తమవుతుంటుంది.
కొన్నాళ్ళ కిందట అతడు వారణాసి పర్యటించాలన్న కోర్కెను వ్యక్తం చేశాడు. కొంచెం ఆశ్చర్యమేసింది. ఎందుకంటే సాధారణంగా అనేకుల దృష్టిలో వారణాసి ఓ ఆధ్యాత్మిక ప్రదేశం. అనుభవాలు పండి, నడిప్రాయంలోనూ, ఆ ప్రాయం దాటే దశలోనో చూడాల్సిన క్షేత్రంగా వారణాసిని పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారయినా కాశీని దర్శించాలని సంప్రదాయాల్ని ఒంటబట్టించుకున్నవారు తలపోస్తారు. కానీ యవ్వనవ్వనంలో వారణాసిని సందర్శించాలనుకున్న వినోద్ దృష్టికోణం భిన్నమైంది. స్వతహాగా భౌతికవాద దృష్టి వున్న వినోద్ వారణాసి పర్యాటక వాంఛ వెనుక ఆధ్యాత్మిక కోణం లేదు, ఆర్తితో కూడిన చారిత్రక, సాంస్కృతిక, సామాజిక గవేషణ ఉంది.
ఆ గవేషణలోంచి మొదలయిన అతని ప్రయాణం అనేకానేక అనుభవాల సమ్మిశ్రితం. తన అనుభవాల పరంపరను కాగితం మీద పెట్టాడు. అద్భుతమైన యాత్రాచరిత్రగా అందించాడు. ఎత్తుగడతోనే మనల్ని ఆకట్టుకుంటాడు. వారణాసి పర్యటన తన అనుభవాలని సారవంతం చేసింది. లోకం మీద, మనుషుల మీద, శ్రమైక జీవుల మీద అతని ప్రేమని బలీయం చేసింది. వారణాసి కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదని, చారిత్రక, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా పలు పార్శ్వాలను పొదువుకున్న నేల అని తెలియజెప్పింది అతని యాత్రారచన.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ బాల్యం ప్రస్తావనతో మొదలు పెట్టి, యాత్రా చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్‌ని తలపోస్తూ, వేల సంవత్సరాల కిందట మానవాళికి విముక్తి మార్గాన్ని ప్రబోధించిన బుద్ధుడు నిర్వాణం చెందిన కుషీనగర్ సందర్శన అనుభవాల్ని రికార్డు చేయడంతో ముగుస్తుంది ఈ రచన.
...
కాశీలో మరణించినా, అక్కడ అంత్యక్రియలు జరిపినా పుణ్యలోకాలకు నేరుగా చేరుకుంటారన్నది హిందువుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వినోద్ ప్రశ్నించలేదు. ఈ నమ్మకం కారణంగా వారణాసి లో శవ దహనం జరగని రోజంటూ ఉండదని, అలా జరిగితే లోకం ఆగిపోయినట్టుగా భావించాలన్న వ్యాఖ్యానం ఓ వాస్తవాన్ని తెలియజెప్పింది. దశాశ్వమేధఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌లని వర్ణించిన తీరు, అక్కడి మనుషుల స్పందనలను, నమ్మకాలను, గంగాహారతి వైశిష్ట్యాన్ని చెప్పిన తీరు ప్రత్యక్ష దృశ్యాలను తలపిస్తాయి. శవదహనాల మధ్య పర్యటిస్తూ కరోనా కాలంనాటి తన రిపోర్టింగ్ అనుభవాలని తలచుకుంటాడు. అంతేగాక మణికర్ణిక ఘాట్ ప్రాంత స్మశాన వాతావరణాన్ని చిత్రిక పట్టడంతో పాటు దాని స్థల పురాణాన్ని ఆసక్తికరంగా ఓ కథలా చెబుతాడు.
..
‘‘#వారణాసిలో ప్రతి క్షణం అమూల్యమైనదే. ప్రతి దృశ్యం కనుల విందుగా ఉంటుంది’’ అంటూ వారణాసిలో సూర్యోదయ దర్శనం గురించి చెబుతాడు. వారణాసి మాదిరిగానే ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం ఎంతో విలువైంది. వారణాసి పట్ల మనలో మరింత ఆసక్తిని ప్రోది చేస్తుంది. ఒక్కో అధ్యాయం చదువుతుంటే వారాణాసి దర్శన అనుభవం కలిగినట్టు అనిపించినప్పటికీ వినోద్ మాదరిగానే ‘సోలో’ పర్యటన చేసి వారణాసిని గుండెలకు హత్తుకోవాలన్న ఉత్సుతకని రేకేత్తిస్తుందీ రచన.
సరళ సుందరంగా ఒక నవల మాదిరిగా సాగిపోయే కథనం పరవశానికి లోను చేస్తుంది. మొదలుపెడితే ఏకబిగిన చదివించే సుగుణం ఈ రచనలోని ఆకర్షణ. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, నైసర్గికంగా, సాంస్కృతికపరంగా బహుళ ప్రత్యేకతలున్న వారణాసి దర్శనం ప్రతి ఒక్కరికి అపురూప అనుభవం. ఆ అనుభవం లేని వారికి దానిని అంది పుచ్చుకోవాలన్న ఉద్విగ్నతకు లోను చేయడం ఈ యాత్రారచన సాఫల్యం. ఇదివరలో ‘ఆమె’ పుస్తకం ద్వారా పరిచయమైన వినోద్ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కానుక ‘వారణాసి’.