గైడ్ ఆఫ్ కాశీ : చిల్ల మల్లేశం, సీనియర్ జర్నలిస్టు, రచయిత
- vinoo Sparkles
- Mar 2, 2024
- 3 min read


వినోద్ మామిడాల పాతికేళ్ల జర్నలిస్టు. ఆ వయసు వాళ్లు తీరిక వేళ మహా అయితే సిగరెట్ల గురించో, లిక్కర్ గురించో లేదంటే లేడీస్ గురించో ఆలోచిస్తారు. ఈ యంగ్ మాన్ కాస్త డిఫరెంట్! ఈయన కూడా ఆడవాళ్ల గురించి ఆలోచిస్తాడు. కానీ మిగిలినవాళ్లలా స్త్రీ
కాటుక కనుల్లో కొంటెతనాన్ని కాకుండా కనులకొనల్లో దాగిన కన్నీటి తడిని చూడాలనుకుంటాడు. మగువ మనస్సు సముద్రమంత లోతంటారు కదా, ఆ లోతుపాతుల్లోకి పోయి ఆ అంత: సంఘర్షణను అక్షరీకరిస్తాడు. ఈక్రమంలో ‘ఆమె’ పుస్తకం ద్వారా ఇప్పటికే ఫెమినిస్టు అనిపించుకున్న ఈ యువరచయిత ఇప్పుడు ట్రావెలర్‌గా మారి ఈ కొత్త పుస్తకం తెస్తున్నాడు. ఇప్పటి కుర్రాళ్లకు ఓ నాలుగురోజులు సెలవు దొరికితే సరదాగా ఏ గోవాకో, పెళ్లయినవాళ్లయితే ఏ కులూ, మనాలీకో ఓ ఎంజాయ్ ట్రిప్ వేస్తారు కదా! వినోద్ నన్ను పది రోజులు సెలవు అడిగినప్పుడు అప్రయత్నంగా ‘ఎందుకు?’ అని అడిగాను. ‘టూర్ వెళ్తా’ అనగానే ‘ఎక్కడికి?’ అన్నాను. అతను ‘కాశీ’ అన్నాడు. నేను కరెక్ట్‌గా విన్నానో లేదో అనుకొని ‘ఏంటీ కాశీనా’ అన్నాను. ‘అవును సార్ వారణాసి’ అన్నాడు. ‘నీ వయస్సేంటి? నువ్వు పోయేదెక్కడికి?’ అని నవ్వుకుంటూనే రెట్టించాను. ఆ మాట అన్నానే గానీ వినోద్ గురించి తెలిసిన నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఇప్పుడీ పుస్తకం చదువుతుంటే ఆయన డెసిషన్ కరెక్టే అనిపిస్తోంది. వినోద్ కాశీ వెళ్లకపోయి ఉంటే మన చేతిలో ఈ పుస్తకం ఉండకపోయేది. అప్పుడు కాశీ గురించి ఇంత చక్కని అవగాహన వచ్చేది కాదు. ఈ బుక్కు రచయిత ‘వారణాసి’ అని పేరు పెట్టాడు కానీ నేను మాత్రం ‘గైడ్ ఆఫ్ కాశీ’ అని క్లియర్‌గా చెప్తున్నాను.


సక్సెస్ఫుల్ విజువలైజేషన్..
పాఠకుల కండ్లు అక్షరాల వెంట పరుగెత్తుతున్నప్పుడు అదే వేగంతో మన మైండ్‌లో భావనాచిత్రాలు ఏర్పడాలి. అప్పుడే సరైన విజువలైజేషన్ జరుగుతుంది. ఈ అక్షర, దృశ్యపరపంరకు ఎక్కడ బ్రేక్ పడినా ఇక అంతే సంగతులు! ఇందుకోసం రచయిత తన అనుభవాలను అక్షరీకరించడాన్ని దాటుకొని దృశ్యీకరించగలగాలి. ప్రతి విషయాన్ని ఏమాత్రం అతిశయం లేకుండా అత్యంత సహజంగా చెప్పినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అప్పుడే పాఠకులకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. ఈ తరహా విజువలైజేషన్లో వినోద్ మామిడాల సక్సెస్ అయ్యాడు. అందుకే కాశీ వీధుల్లో ఆయన తిరుగుతూ ఆ ముచ్చట్లు మనకు చెప్తున్నప్పుడు మనం కూడా కాశీలో తిరుగుతున్నట్లు ఫీల్ అవుతాం.
టైం మిషన్ ఎక్కించిండు..
కాశీకి ఫ్లైట్‌లో వెళ్లిన వినోద్ మనల్ని మాత్రం ముందుగా టైం మిషన్ ఎక్కించి వెనక్కి నడిపిస్తాడు. స్వాతంత్రోద్యమ కాలానికి పట్టుకెళ్లి వారణాసి ముద్దుబిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ చేయిపట్టించి, ఆయన అడుగులో అడుగు వేయిస్తాడు. గుండెల నిండా దేశభక్తిని నింపుకున్నాక అటునుంచి అటే ఆధ్యాత్మిక క్షేత్రంలోకి తీసుకెళ్తాడు. ఈ తరహా ప్రిఫేస్ చాలా తక్కువగా చూస్తుంటాం. ఈ ఇంట్రడక్షన్ కూడా ఆయన వారణాసి పర్యటన అనుభవం నుంచే వచ్చినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోతాం. దీనిని బట్టి టూర్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించిన వినోద్, ప్రతి అనుభవాన్ని తన పుస్తకంలోకి జాగ్రత్తగా ఎలా ఒంపుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక రచయిత ముందుమాటలో చెప్పినట్లు కాశీలోని ఆధ్యాత్మికతతోపాటు, విద్వత్తును, చరిత్రతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను, వాటితోపాటే మతసామరస్యతనూ, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఈ పుస్తకం ద్వారా కండ్ల కట్టాడు. వారణాసి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం కాదని, అది విజ్ఞాన నగరి అని వినోద్ సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాడు. ‘భక్తులకు దైవభూమి.. ఔత్సాహికులకు పరిశోధనా కేంద్రం.. టూరిస్టులకు పర్యాటక కేంద్రం.. ‘తీరిక లేకుండా తిరిగినా తీరని దాహం కాశీ ప్రయాణం..’ అంటూ పాఠకులను ఊరించాడు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకండి..
ఇంతకీ కాశీ నగరం ఎలా ఉంటుంది? అక్కడి ప్రముఖ ఏరియాలు, ప్రధాన చౌరాస్తాలు ఏంటి? మనం దిగాల్సిన హోటళ్లు, సత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి? అక్కడికి ఎలా వెళ్లాలి? వారణాసిలో లోకల్ పబ్లిక్, అక్కడి వచ్చే భక్తులు, సాధువుల కట్టు, బొట్టు, మాట తీరు ఎలా ఉంటాయి? ఇంతకీ కాశీ అంటే అర్థమేంటి? కాశీకి ఉన్న మరో పేర్లు ఏంటి? హిందువుల పవిత్ర నగరం కాస్తా మోక్షనగరం ఎందుకైంది? కాశీలో ఆకలికి చోటులేదనే మాట ఎందుకు వచ్చింది? కాశీలో ఉన్న ప్రధాన ఆలయాలేంటి? విశ్వనాథుడి దర్శనానికి ఏ టైంలో, ఎలా వెళ్లాలి? కీలకమైన గంగా తీరాన మొత్తం ఎన్ని ఘాట్లు ఉన్నాయి? వాటిలో ప్రధాన ఘాట్లు ఏంటి? రోజుకు 100కు పైగా శవాలను దహనం చేసే చోటేది? తమిళ కుటుంబాలు అక్కడ పడవలు ఎందుకు నడుపుతున్నాయి? గంగా హారతిని ‘బెస్ట్ విజువల్ ట్రీట్’ అని రచయిత ఎందుకన్నాడు? కాశీ స్ట్రీట్‌ఫుడ్‌లో తప్పక రుచి చూడాల్సిన పదార్థాలేంటి? సారాయ్ మోహనకు ‘సిల్క్ విలేజ్ ఆఫ్ బనారస్’ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఈ బుక్ ను ఆసాంతం చదవాల్సిందే!
అలలు అలలుగా..
‘నదీ ప్రవాహంతో పాటే పడవ తేలికగా ముందుకెళ్తున్నది.. సూర్యకిరణాలు నిటారుగా నదిపై పడుతూ అలల అంచును తాకి మిలమిలా మెరుస్తున్నాయి..” అంటూ తనలోని భావుకుడిని పలుమార్లు రచయిత బయటపెట్టాడు. కాశీలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఆస్వాదించడం గురించి, చిన్నపాటి బొగ్గుల బ్రేజియర్ పై చిక్కటి పాలతో చేసే చక్కటి టీ గురించి చెప్పిన తీరు కట్టిపడేస్తుంది. మాన్ మందిర్ ప్యాలెస్ లోని అబ్జర్వేటరీ, అందులో నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని రికార్డ్ చేయగల ఆపాత పరికరాల గురించి, వారణాసి వర్చువల్, సారనాథ్ మ్యూజియాల విశేషాల గురించి, సారనాథ్ డీర్‌పార్క్ లోని బౌద్ధ అవశేషాల గురించి, ముఖ్యంగా ఆశోకుని స్మారక చిహ్నాల గురించి, బెనారస్ హిందూ యూనివర్సిటీ గురించి రచయిత వర్ణిస్తుంటే వారణాసిని ‘విజ్ఞాన నగరి’ అని ఎందుకంటారో అర్థమవుతుంది. కాకపోతే కాశీ విద్యాకేంద్రంగా వర్ధిల్లడానికి కారణమైన బనారస్ హిందూ యూనివర్సిటీ గురించి నాలుగంటే నాలుగు ముక్కల్లో ముగించడం కాస్త అసంతృప్తి కలిగింది.
జీవితాలకూ చోటుంది..
కాశీ వీధులు, ఆలయాలు, ఘాట్లు, మ్యూజియాల గురించే కాదు, తన ప్రయాణంలో ఎదురైన మనుషుల జీవితాలకూ ఈ బుక్‌లో రచయిత చోటిచ్చాడు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ల మీద, దుకాణాల పక్కన ప్రపంచాన్ని మరిచి నిద్రపోతున్న వాళ్ల గురించి, కాషాయ వస్త్రాలు ధరించి ముడతలు పడిన శరీరాలతో, అడ్డ నామాలతో, రుద్రాక్షలతో సంచరించే సాధువుల గురించీ, సారనాథ్ లో తిరగాడే బౌద్ధ భిక్షువుల గురించీ రాశాడు. వీధుల్లో కుక్కలు, దూరంగా గస్తీ కాసే పోలీసుల గురించీ చెప్పాడు. తాను ఎక్కిన బోటును నడిపిన తమిళియన్ రతన్ లాల్ ద్వారా ఘాట్ల విశేషాలను, సారాయ్ మోహన గ్రామంలో మహమ్మద్ అన్సారీ ద్వారా చేనేత కార్మికుల బతుకు చిత్రాలను కళ్ల గ ట్టాడు. ఇక మాన్ సింగ్ ప్యాలెస్ లో కలిసిన ‘ఈశాని జై శ్వాల్’ కథకు కాస్తా ఎక్కువే చోటిచ్చాడు. కుటుంబ కట్టుబాట్లను, అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యం చేరిన ఈ యువతి కథ ఆలోచింపజేస్తుంది. చివర్లో జ్ఞానాన్వేషణ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన రాహుల్ సాంకృత్యాయన్ జీవిత విశేషాల గురించి చెప్పిన తీరును బట్టి ఈ ‘సోలో ట్రావెలర్’ అసలు లక్ష్యం ఏమిటో మనకు బోధపడుతుంది. ఆయన దేశాటన ఇలాగే కొనసాగాలని, ఆయన కలం నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షిస్తూ..
–చిల్ల మల్లేశం
సీనియర్ జర్నలిస్టు, రచయిత